how to prepare 10th class final exams
100days Curriculum:
How To Prepare 10th class board exams:
పదోతరగతి పరీక్ష విద్యార్థి జీవితంలో మొదటి మైలురాయి. తర్వాతి దశలో ఏ పరీక్షలకు హాజరైనా.. ఎలాంటి ఉద్యోగానికి ప్రయత్నించినా.. పదిలో సాధించిన మార్కులెన్నో పరిశీలిస్తారు.
అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అందుకే ఈ పరీక్షలు అందరికీ ఎంతో ముఖ్యం.
మంచి మార్కులు సాధించడమే లక్ష్యం. కాస్త ప్రణాళికతో వెళితే అదంత కష్టం కాదంటున్నారు నిపుణులు. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షా విధానంపై పరిపూర్ణమైన అవగాహన పెంచుకోవాలి. వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే అందరికీ సిలబస్ దాదాపు పూర్తయి ఉంటుంది. ఇక వార్షిక పరీక్షలకు సిద్ధంకావడంపైనే దృష్టి పెట్టాలి. ఎలా చదవాలి? ఎంత చదవాలి? రివిజన్ ఎప్పుడు మొదలుపెట్టాలి? ఇలాంటి సందేహాలతో సతమతమై ఆందోళన పెంచుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. పరీక్షలకు సుమారు వందరోజులకు మించి సమయం ఉంది.చక్కగా ఉపయోగించుకుంటే మంచి ప్రిపరేషన్‌కు ఈ వ్యవధి చాలు. సబ్జెక్టును చదవడం ఎంత ముఖ్యమో, రివిజన్ చేయడం అంతే అవసరమని గుర్తించాలి. వీలైతే చదివింది ఒకసారి రాసి చూసుకోవడం ఇంకా మంచిది. పరీక్షలకు చాలా వ్యవధి ఉందనే విషయాన్ని గమనించి పరీక్షల భయాన్ని వదిలేయాలి. ఆందోళన మొదలైతే చదివింది మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రయత్నపూర్వకంగానైనా ప్రశాంతతను అలవాటు చేసుకోవాలి. ప్లాన్ లేకుండా ఏ పని చేసినా గందరగోళంగా ఉంటుంది. అందుకే అన్ని విధాలా అనుకూలమైన స్వీయ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఉపాధ్యాయుల సాయాన్ని తీసుకోవచ్చు. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులనూ అర్థం చేసుకుంటూ చదవాలి. తర్వాత చూడకుండా రాయాలి. సమాధానాలను సరిచూసుకోవాలి. సరిగా రాకపోతే మళ్లీ అధ్యయనం చేయాలి. ప్రశ్నపత్రంపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి.
జనరల్ సైన్స్:
పేపర్-1: జనరల్ సైన్స్‌లో భౌతిక, రసాయన శాస్త్రాలు పేపర్-1గా ఉంటాయి. మారిన ప్రశ్నపత్రంలో నాలుగు సెక్షన్లలో నిర్దేశించిన విద్యా ప్రమాణాలకు అనుగుణంగా 33 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ విద్యార్థి లోతైన అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. అరమార్కు, ఒకటి, రెండు మార్కుల ప్రశ్నల్లో ముఖ్యంగా కారణాలు తెలపడం, పటం ఆధారిత ప్రశ్నలు, సమస్యా సాధన, నిత్య జీవితంలో అనువర్తనాలపై ప్రశ్నలు ఇస్తారు. నాలుగు మార్కుల ప్రశ్నల్లో ముఖ్యంగా భేదాలు రాయడం, ప్రయోగాలు వివరించడం, పట్టిక ఆధారిత ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నలు, పేరగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలడగడం, కిరణ పత్రాలపై ప్రశ్నలుంటాయి. కృత్యాలు, ప్రయోగ అంశాల్లో కావాల్సిన పరికరాలు, పరిశీలనలు, జాగ్రత్తలు నేర్చుకోవాలి.
పేపర్-2: జీవశాస్త్రం పరీక్షలో అర మార్కు ప్రశ్నల్లో ముఖ్యంగా ఉదాహరణలు రాసే ప్రశ్నలు, బొమ్మఆధారిత, పదాన్ని మార్చి రాసేవి, శాస్త్రవేత్తలు-పరిశోధనలు, ఫ్లోచార్టు ఇచ్చి తప్పిపోయిన పదాన్ని రాసేవి, నేనెవర్నీ అని అడిగే ప్రశ్నలు, అది అయితే ఇది ఏమి.. అని ప్రశ్నించేవి వస్తాయి. ఒకటి, రెండు మార్కుల ప్రశ్నల్లో కారణాలను తెలపడం, పరికల్పనలు చేయడం, వైద్య నిపుణులు, పర్యావరణ వేత్తలు వంటి వారిని ప్రశ్నించడం, బొమ్మ ఆధారిత, దత్తాంశ విశ్లేషణకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నాలుగు మార్కుల్లో ముఖ్యంగా భేదాలు, ప్రక్రియలను వివిధ సోపానాలలో వివరించడం, నినాదాలు, పాటించాల్సిన నియమాలు, బొమ్మఆధారిత, ప్రయోగ ఆధారిత, దత్తాంశ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. బొమ్మలకు సంబంధించిన ప్రశ్నల్లో బొమ్మ ఇచ్చి ప్రశ్నలడగడం లేదా బొమ్మ గీసి వివరణ అడగడం వంటి ప్రశ్నలు ఇస్తారు. వాటిని అధ్యయనం చేయాలి. - పీఆర్.జగదీశ్, కె.మంజుల
తెలుగు:
పేపర్-1: అవగాహన- ప్రతిస్పందన ప్రశ్నలు 16 మార్కులకు ఉంటాయి. ఇందులో ప్రతిపదార్థం, పద్యపూరణం, భావం రాయాలి. శివరాజంతట, తనచూపంబుధి, ఆ-యేమీ యెుకరాణివాసమును, మా సర్దారుడు, దెసలను కొమ్మలొయ్య.. పద్యాలను బాగా చదవాలి. పరిచిత గద్యానికి పూర్తి వాక్యాలతో సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి. యవనపు పుణ్యాంగనామణి, వఱదైన చేను దున్నకు, ఓ మునీశ్వర.. వంటి చిన్న పద్యాలను సాధన చేయాలి. వ్యక్తీకరణ- సృజనాత్మకత ప్రశ్నలను 22 మార్కులకు ఇస్తారు. ఒక కవిపరిచయం, ఒక నేపథ్యం, ఒక ప్రక్రియ తప్పనిసరిగా ఉంటాయి. వీటికి నాలుగైదు వాక్యాల్లో స్పష్టంగా జవాబు రాయడం నేర్చుకోవాలి. భాషాంశాలకు 12 మార్కులు. అలంకారం, ఛందస్సు ఆరు మార్కులకు ఉంటాయి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం మొదలైన పద్యాలకు గణవిభజన చేసి, ఏ పద్యమో గుర్తించి, లక్షణాలను రాయడాన్ని అభ్యాసం చేయాలి. లక్ష్యాత్మక ప్రశ్నల్లో అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతి, సంధులు, సమాసాలు ఉంటాయి. మొత్తం 12 మార్కులకు వస్తాయి.
పేపర్-2: ఈ పేపర్‌లో రామాయణం కీలకం. 4 మార్కులకు ఒక సంఘటన క్రమం, పది మార్కులకు అయిదు లఘుప్రశ్నలు, 4 మార్కులకు ఒక వ్యాసరూప ప్రశ్న మొత్తం 18 మార్కులకు ఉపవాచకం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవేకాకుండా ఒకటి రెండు జాతీయాలను అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అన్ని కాండలు చదవాలి. అవగాహన- ప్రతిస్పందనకు సంబంధించి రామాయణంలోని ఏదో ఒక కాండ నుంచి సంఘటన క్రమాన్ని మొదటి ప్రశ్నగా అడుగుతారు. రెండో ప్రశ్నలో అపరిచిత పద్యానికి అంటే.. సుమతీ, వేమన, కుమార, తెలుగుబాల మొదలైన శతకాల నుంచి ఇచ్చిన పద్యాన్ని జాగ్రత్తగా చదివి భావంతో పాటు నీతి, విశేషాలు రాయాలి. తర్వాత రెండు అపరిచిత గద్యాలు ఉంటాయి. కరపత్రం, లేఖ, సంభాషణ, ప్రకటన మొదలైనవి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే 8కి 8 మార్కులు పొందవచ్చు. వ్యక్తీకరణ- సృజనాత్మకత ప్రశ్నలు 22 మార్కులకు ఇస్తారు. పాత్రస్వభావం, నీవేమి గ్రహించావు, విషయాత్మక ప్రశ్నలు ఉంటాయి. వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధం, రామాయణ ప్రాశస్త్యం, శ్రీరామలక్ష్మణుల యాగసంరక్షణ చేసిన విధానం, శ్రీరామసుగ్రీవుల మైత్రి, సీతాపహరణం మొదలైనవి ప్రధానంగా చదవాలి. - జోస్యుల లక్ష్మీకాంత్
గణితం:
గణితం పేపర్-1లో ఏడు, పేపర్-2లో ఏడు అధ్యాయాలతో మొత్తం వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పేపర్-1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, శ్రేఢులు ప్రధానంగా చదవాలి.పేపర్-2లో నిరూపక రేఖాగణితం, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రం, సంభావ్యతలపై దృష్టిసారించాలి. ఇప్పటి నుంచి ప్రతివారం రెండు విభాగాల చొప్పున పూర్తిస్థాయిలో రోజుకు 2గంటల చొప్పున సాధన చేయాలి. పునశ్చరణ కోసం ప్రతి అధ్యాయానికి చెందిన సూత్రాలు, పట్టికలు, నిర్వచనాలు, పటాలు, ఒకచోట రాసుకోవాలి. మైండ్ మ్యాప్స్ వేసుకోవాలి. సమస్యల సాధనలో సూక్ష్మీకరణలు సరిగ్గా చేయడం, జవాబులు పూర్తి చేయడం చాలా అవసరం. కారణాలు చెప్పడం, నిరూపణలు చేసేటప్పుడు తగిన కారణాన్ని సమాధానాల వద్ద బాక్సుల్లో రాయడం ప్రాక్టీస్ చేయాలి. రేఖాగణితంలో ముఖ్యంగా నాలుగు సిద్ధాంతాలు, వాటి అనువర్తన ప్రశ్నలను సాధన చేయాలి. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, సరూప త్రిభుజాల వైశాల్యాల సిద్ధాంతం, స్పర్శరేఖల సిద్ధాంతంతోపాటు సరూప త్రిభుజాల నిర్మాణం, స్పర్శరేఖల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ప్రతి అధ్యాయంలో పటాలను సాధన చేసి గీయడం నేర్చుకోవాలి. చాప్టర్ల చివర ఇచ్చిన కీలక భావనలపై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్:
ఆంగ్లంలో అధిక మార్కులు సాధించాలంటే తేలికగా నేర్చుకోగలిగిన అంశాలను ముందుగా సాధన చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్‌కు ప్రశ్నపత్రంలో 30 శాతం మార్కులు కేటాయించారు. ఈ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్నతశ్రేణి ఆలోచనలు, విశ్లేషణాత్మక అవగాహనను పరీక్షించే ప్రశ్నలను ఎక్కువ సాధన చేయాలి. గ్రామర్ విభాగంలో ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్‌కు 9 మార్కులు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి ఉంచాలి. ఎడిటింగ్ ప్యాసేజస్‌ను ఎక్కువ సంఖ్యలో సాధన చేయాలి. టెన్సెస్‌కు మార్కుల వెయిటేజీ పెరిగింది. ఆర్టికల్స్ కొత్తగా ప్రశ్నపత్రంలో చేరాయి. లాంగ్వేజ్ ఫంక్షన్‌లో వచ్చిన మార్పులను విద్యార్థులు గమనించాలి. వొకాబ్యులరీ విభాగంలో డిక్షన్రీ ఎంట్రీని చేర్చారు.దీని కోసం లెర్నర్స్ డిక్షన్రీని పరిశీలించాలి. రైటింగ్ విభాగంలో ఇచ్చిన ప్యాసేజ్‌లో నిర్దేశించిన భాగాలపై ప్రశ్నలను తయారు చేయమని అడుగుతారు. దీని కోసం పాఠ్యపుస్తకంలో సి.రీడింగ్ పాఠ్యాంశాలను సాధన చేయాలి. - నవులూరి పేరయ్య
సాంఘికశాస్త్రం:
సాధారణంగా మొదటి పేపర్‌లోని 12 పాఠాల్లో మార్కులు సాధించడం కొంత తేలిక. రెండో పేపర్‌తో పోల్చినప్పుడు మొదటి పేపర్ స్కోరింగ్‌కి అనుకూలం. అందుకే మొదటి పేపర్‌లోని ప్రధాన భావనలపై కచ్చితమైన అవగాహన పెంచుకోవాలి. 3, 9 పాఠ్యాంశాల్లోని గ్రాఫ్‌లు చాలా ముఖ్యమైనవి. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం పాయింట్ల రూపంలో రాసుకోవాలి. ఒకటి, అయిదు చాప్టర్లలోని పటాలను బాగా సాధన చేయాలి.పేపర్-2లో ఎక్కువ మార్కులు సాధించాలంటే సొంతంగా జవాబులు రాయాల్సిన ప్రశ్నలను చూసి ఆందోళన చెందకుండా సాధన చేయాలి. 13, 14, 15, 21, 22 పాఠాల నుంచి చదివి గుర్తుంచుకోవాల్సిన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ. 13, 14 పాఠాల్లోని కాల పట్టికలు సమాచార నైపుణ్యాల రీత్యా అత్యంత ముఖ్యమైనవి. వీటి గురించి ఆయా పట్టికల్లో లేని ముఖ్యమైన సమాచారాన్ని నేర్చుకోవాలి. అన్ని పాఠాల్లో వచ్చిన దేశాల పేర్లు జాబితా రాసుకుని ఖండాల వారీగా సాధన చేయాలి. - ఆర్. రాఘవరెడ్డి
హిందీ:
భాష, వ్యాకరణం, సృజనాత్మక అంశాల్లో విద్యార్థి ప్రతిభను పరీక్షించే విధంగా హిందీ సబ్జెక్టులో ప్రశ్నలు వస్తాయి. కొత్త విధానంలో రెండు నూతన అంశాలను పొందుపరిచారు. ఒకటి ప్రకటన (అడ్వర్టైస్‌మెంట్), రెండోది హింట్ స్టోరీ. ప్రకటన చదివి ప్రశలకు జవాబులు రాయాలి. హింట్ స్టోరీకి సంబంధించి ఏదో ఒక తెలుగు కథని హిందీలో ఇస్తారు. దాన్ని చదివి విభక్తులతో పూర్తి చేయాలి. అన్ని పాఠ్యాంశాలకు ప్రశ్నాపత్రంలో సమానమైన వెయిటేజీ ఉంది. భాషాకీ బాత్ (వ్యాకరణం), అర్థగ్రాహ్యతా ప్రతిక్రియ (అవగాహన, ప్రతిస్పందన), అభివ్యక్తి (పాఠాల్లోని ప్రశ్నలకు, తగిన జవాబులు రాయడం), సృజనాత్మక విభాగాలుగా ప్రశ్నతం ఉంటుంది. ప్రధానంగా సారాంశాలు, పత్ర్, నిబంధ్, వ్యాకరణాంశాలపై దృష్టిపెట్టాలి. భాషాకీ బాత్ జాత్రగత్తగా అవగాహన చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. హిందీ రాయడం ఎవరికైతే బాగా వస్తుందో వారు ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు తగిన విధంగా అభ్యాసం చేయాలి..

0 Comments:
Post a Comment